పాకిస్తాన్ పరిస్థితి కనాకష్టంగా దిగజారిపోయింది. భారతదేశం ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట ఉగ్రవాద స్థావరాల మీద దాడులు ప్రారంభించిన రెండు రోజులకే.. భారీగా నష్టపోయాం, అప్పులు కావాలంటూ ప్రపంచ బ్యాంకు, ఇతర అంతర్జాతీయ భాగస్వాములను బహిరంగంగానే అభ్యర్ధిస్తోంది. పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను కుప్పకూల్చిన భారత్, ఆ తర్వాత పాకిస్తాన్ కవ్వింపు చర్యలతో వారి రక్షణ విభాగాలను నిర్వీర్యం చేసింది. భారతదేశంలోని ఉత్తర, పశ్చిమ భాగాల్లో 15 వ్యూహాత్మకంగా ప్రాధాన్యం కలిగిన సైనిక స్థావరాలపై దాడులు చేయడానికి పాకిస్తాన్ చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. స్వీయ రక్షణలో భాగంగా భారతదేశం దాయాది దేశపు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌ను ధ్వంసం చేసింది.
భారత్ ఉగ్రవాద స్థావరాలు, వారికి అండగా నిలుస్తున్న వ్యూహాత్మక ప్రదేశాలపై చేస్తున్న దాడులను పాకిస్తాన్ తమ దేశం మీద చేస్తున్న యుద్ధంగా అభివర్ణిస్తోంది. సోకాల్డ్ యుద్ధం ముదరుతోందన్న వార్తల నేపథ్యంలో పాకిస్తాన్ దేశపు స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోయింది. ఉగ్రవాదులకు స్థావరమైన పాకిస్తాన్ ఇప్పుడు, డీఎస్కలేషన్ కోసం సహాయం కావాలంటూ తమ అంతర్జాతీయ భాగస్వాములను ఋణాలు అడుగుతోంది.
నిజానికి పాకిస్తాన్ ఈ ఋణాలను అడుగుతున్నది యుద్ధ వాతావరణాన్ని తగ్గించడం కోసం కాదు… ఆయుధాలు, క్షిపణులు, మందుగుండు సామగ్రి కొనుగోలు చేయడానికి అనీ, వాటిని మళ్ళీ ఉగ్రవాదులకు ఇచ్చి వారి ద్వారా భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలను రెచ్చగొట్టడానికే ఉపయోగిస్తుంది అనీ అందరికీ తెలిసిన విషయమే.
‘‘శత్రువు వల్ల కలిగిన భారీ నష్టాల తర్వాత అంతర్జాతీయ భాగస్వాముల నుంచి పాకిస్తాన్ ప్రభుత్వం మరిన్ని ఋణాలు కావాలని కోరుతోంది. ముదురుతున్న యుద్ధం, స్టాక్ మార్కెట్ పతనం వల్ల దిగజారిన పరిస్థితుల నుంచి సాధారణ స్థితికి చేరుకోడానికి మాకు సహాయం చేయాలని అంతర్జాతీయ భాగస్వాములను కోరుతున్నాం’’ అని పాకిస్తాన్ ప్రభుత్వపు ఆర్ధిక వ్యవహారాల విభాగం ట్వీట్ చేసింది, ఆ పోస్ట్‌ను ప్రపంచబ్యాంకుకు ట్యాగ్ చేసింది కూడా.
అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఇంటర్నేషనల్ మోనిటరీ ఫండ్ – ఐఎంఎఫ్) ఎగ్జిక్యూటివ్ బోర్డు ఇవాళ పాకిస్తాన్ అధికారులతో సమావేశమైంది. అదనపు నిధుల కోసం పాకిస్తాన్ ఐఎంఎఫ్‌కు విజ్ఞప్తి చేసింది. దాని సాధ్యాసాధ్యాల గురించి ఐఎంఎఫ్ పరిశీలించనుంది.
ఐఎంఎఫ్ బోర్డ్ మీటింగ్ రేపు శుక్రవారం అంటే ఏప్రిల్ 10న జరగనుంది. ఆ సమావేశంలో పాకిస్తాన్‌కు 130 కోట్ల డాలర్ల ఋణం ఇవ్వాలా అన్న అంశంపై చర్చ జరుగుతుంది. అయితే, ఐఎంఎఫ్‌లోని భారతదేశపు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆ సంస్థ బోర్డ్ మీటింగ్‌లో మన దేశపు వైఖరి గురించి స్పష్టం చేస్తారని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ చెప్పారు. పాకిస్తాన్‌కు ఋణం ఇస్తే ఆ నిధులను భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాల కోసమే వినియోగిస్తారన్న సంగతిని భారత డైరెక్టర్ వివరించే అవకాశం ఉంది.
ఐఎంఎఫ్ బోర్డు సభ్యులు వాస్తవాల ఆధారంగా నిర్ణయం తీసుకుంటారని విక్రమ్ మిస్రీ అభిప్రాయపడ్డారు. ‘‘బోర్డు ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది వేరే సంగతి. కానీ పాకిస్తాన్ విషయంలో ఏం జరుగుతుందో వారికి నిదర్శనాలు ఉన్నాయి. గత మూడు దశాబ్దాల్లో ఐఎంఎఫ్ ఎన్నోసార్లు పాకిస్తాన్‌కు బెయిలౌట్ ప్రోగ్రామ్స్ ఇచ్చింది. అయితే ఆ బెయిలౌట్ కార్యక్రమాలు నిజంగా అమలయ్యాయా, ఆ నిధులు ఆ దేశ ప్రజలకు ఉపయోగపడ్డాయా అంటే, చాలా సందర్భాల్లో అలా జరగలేదు. ఆ నిధులు దేనికి ఉపయోగపడ్డాయి అనే సంగతి అందరికీ తెలిసిందే’’ అని విక్రమ్ మిస్రీ చెప్పుకొచ్చారు.
పాకిస్తాన్‌కు నిధులు, ఋణాలూ ఇచ్చే అంశాన్ని పునఃపరిశీలించాలంటూ భారత ప్రభుత్వం ఐఎంఎఫ్ సహా పలు అంతర్జాతీయ ఏజెన్సీలకు విజ్ఞప్తి చేసింది. పాకిస్తాన్‌ను మళ్ళీ గ్రే లిస్ట్‌లో పెట్టాలంటూ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్‌ను (ఎఫ్ఏటీఎఫ్) కోరింది.
పాకిస్తాన్ ఇటీవల దివాలా తీసే పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ దేశానికి ఐఎంఎఫ్ ఆర్థిక ప్యాకేజీలు ఇచ్చింది. ఆ నిధుల వినియోగం ఎలా జరిగిందో సమీక్షించాలంటూ భారత్ ఐఎంఎఫ్‌ను కోరింది. అలాగే పాకిస్తాన్‌లో ఇప్పుడు పలు ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం అందిస్తున్న వరల్డ్ బ్యాంక్, ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ తదితర ఆర్థిక సంస్థలతో కూడా భారత్ సంప్రదింపులు జరుపుతోంది. పాకిస్తాన్‌కు ఈ దశలో చేసే ఏ సాయమైనా ఉగ్రవాదులకు మాత్రమే ఉపయోగపడతాయనీ, ఆ దేశం ఆయుధాలు సమకూర్చుకుందుకు మాత్రమే వాడుతుందనీ భారత్ అంచనా వేస్తోంది. అదే విషయాన్ని అంతర్జాతీయ ఆర్థిక సంస్థల ముందు ఉంచుతోంది.
ఈ పరిస్థితుల్లో ఎంత అడుక్కున్నా పాకిస్తాన్‌కు ఎక్కడినుంచయినా అప్పు పుట్టే దాఖలాలు పెద్దగా కనిపించడం లేదు.