భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ గురించి సైన్యం మీడియాకు వివరించింది. ఆ సందర్భంగా ఇద్దరు మహిళా అధికారులు భారత మిలటరీ ఉగ్రవాద స్థావరాలపై చేసిన ప్రెసిషన్ స్ట్రైక్స్ గురించి వివరించడం ప్రపంచానికి ఒక బలమైన సందేశాన్ని పంపించింది. వారే వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కల్నల్ సోఫియా ఖురేషీ.
ఉగ్రవాదులు పహల్‌గామ్‌లో దాడి చేసినప్పుడు ఉద్దేశపూర్వకంగా వారు హిందూ పురుషులను చంపి, వారి మహిళలను వదిలేసారు. ‘పోయి మోదీకి చెప్పుకోండి’ అంటూ హెచ్చరించారు. అలాంటి ఉగ్రవాదుల దాడిలో సిందూరాన్ని కోల్పోయిన మహిళలకు నివాళిగా, ఉగ్రవాద స్థావరాలపై దాడుల చర్యకు ‘ఆపరేషన్ సిందూర్’ అని పేరు పెట్టడం ద్వారా మహిళలకు భారత్ ఎంత గౌరవాన్నిస్తుందో ప్రతీకాత్మకంగా ప్రకటించింది మన దేశం. దానికి కొనసాగింపుగా, ఆ మిలటరీ ఆపరేషన్ వివరాలను మహిళా అధికారులతో చెప్పించి భారతీయ మహిళల శక్తిని ప్రపంచానికి చాటింది.
కల్నల్ సోఫియా సింగ్ మాట్లాడుతూ ‘‘సరిహద్దులకు ఆవలినుంచి భారత్‌లో ఉగ్రవాదానికి పాల్పడుతున్న వారి గురించి విశ్వసనీయమైన నిఘా సమాచారం తెలుసుకున్నాం. దాని ఆధారంగా లక్ష్యాలను ఎంపిక చేసుకున్నాం. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాకిస్తాన్ సైనిక స్థావరాలను మాత్రం లక్ష్యం చేసుకోలేదు. మొత్తం తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసాం’’ అని వెల్లడించారు.
వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మాట్లాడుతూ ‘‘భారతదేశం తన ప్రతిచర్యలో తగినంత సంయమనాన్ని పాటించింది. అయితే పాకిస్తాన్ ఎలాంటి దుస్సాహసమైనా చేస్తే, ఉద్రిక్త పరిస్థితులను పెంచితే దాన్ని ఎదుర్కోడానికి భారత సైనిక బలగాలు పూర్తిగా సంసిద్ధంగా ఉన్నాయి’’ అని ప్రకటించారు.
ఎవరీ మహిళామణులు?
వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ భారత వైమానిక దళానికి చెందిన విశిష్ఠమైన హెలికాప్టర్ పైలట్. చదువుకునే రోజుల్లో ఆమె ఎన్‌సీసీ క్యాడెట్. ఇంజనీరింగ్ పూర్తి చేసాక భారత వైమానిక దళంలో చేరారు. 2018 డిసెంబర్ 19న ఫ్లయింగ్ బ్రాంచ్‌లో పెర్మినెంట్ కమిషన్ పొందారు. జమ్మూ కశ్మీర్, ఈశాన్య భారతం వంటి దేశంలోని అత్యంత సంక్లిష్టమైన భౌగోళిక వాతావరణ పరిస్థితుల్లో ఆమె చేతక్, చీతా వంటి హెలికాప్టర్లను నడిపిన అనుభవం కలిగిన మహిళ. ఆమె ఎన్నో ప్రాణాంతక సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
కల్నల్ సోఫియా ఖురేషీ భారత సైన్యంలోని కార్ప్స్ ఆఫ్ సిగ్నల్స్ విభాగంలో ఎన్నో పతకాలు గెలుచుకున్న అధికారి. గుజరాత్‌కు చెందిన సోఫియా ఖురేషీ జీవరసాయన శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసారు. ఐక్యరాజ్య సమితి శాంతి మిషన్‌లో భాగంగా 2006లో ఆఫ్రికన్ దేశం కాంగోలో విధులు నిర్వర్తించారు. 2016లో మహారాష్ట్రలోని పుణేలో భారతదేశం బహుళదేశీయ సైనిక విన్యాసాల కార్యక్రమం నిర్వహించింది. ఆ ఎక్సర్‌సైజ్‌లో 18 దేశాల ఆర్మీ కంటింజెంట్‌లు పాల్గొన్నాయి. వాటిలో భారత ఆర్మీ కంటింజెంట్‌కు సోఫియా ఖురేషీ నాయకత్వం వహించారు. భారతదేశపు సైనిక కంటింజెంట్‌కు నాయకత్వం వహించిన మొట్టమొదటి మహిళ ఆమే కావడం విశేషం.
భారతీయ మహిళలను అవమానించిన పాకిస్తానీ ముస్లిం ఉగ్రవాదులకు దీటైన జవాబిచ్చిన భారతదేశపు మిలటరీ ఆపరేషన్ ‘సిందూర్’ వివరాలను మహిళా అధికారులే ప్రపంచానికి తెలియజేసారు. మహిళా శక్తికి భారతదేశం ఎంత ప్రాధాన్యం, ఎంత గౌరవం ఇస్తుందనడానికి ఇంతకుమించి నిదర్శనం ఏముంటుంది?