ముఖ్యాంశాలు:
పాకిస్తాన్ భూభాగంలోని 5 ఉగ్రవాద స్థావరాలు…
పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని 4 ఉగ్రవాద స్థావరాలు….
మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిన భారత్
పహల్‌గామ్‌లో హిందూ పర్యాటకులను హతమార్చిన పాకిస్తానీ ముస్లిం ఉగ్రవాదులు
ఆ చర్యకు ప్రతీకారంగా ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టిన భారత్
భారతదేశపు పదాతి, నౌకా, వైమానిక దళాల సంయుక్త ఆపరేషన్
త్రివిధ సైనిక దళాలూ సంయుక్తంగా దాడి చేయడం 1971 తర్వాత మొదటిసారి
జమ్మూకశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లా పహల్‌గామ్‌లో 2025 ఏప్రిల్ 22న పర్యటిస్తున్న హిందువులపై పాకిస్తానీ ఉగ్రవాదులు దాడులు చేసారు. మతం అడిగి హిందువులను, ముస్లిములను వేరు చేసి, ఎంపిక చేసుకున్న హిందూ పర్యాటకులను కాల్చి చంపారు. 26మందిని హత్య చేయగా వారిలో 24మంది హిందువులు. ఒకరు క్రైస్తవ పర్యాటకుడు కాగా మరొకరు ముస్లిం పోనీ రైడర్. పర్యాటకులు హిందువులా ముస్లిములా అని తెలుసుకోవడం కోసం ప్యాంట్లు విప్పదీసి సున్తీ అయిందా లేదా అన్నది పరిశీలించి ఆ తర్వాతే చంపారు. ‘వెళ్ళి మీ మోదీకి చెప్పుకో పో’ అని హతశేషులను హెచ్చరించారు. కాళ్ళ పారాణి ఆరని నవ వధువు సహా పలువురు హిందూ మహిళల నుదుటి సిందూరాన్ని తుడిచేసారు.
పాకిస్తానీ ముస్లిం ఉగ్రవాదులు హిందూ పర్యాటకులను హతమార్చిన పదిహేను రోజులకు, 2025 ఏప్రిల్ 6 అర్ధరాత్రి దాటాక, ఏప్రిల్ 7వ తేదీ రాత్రి 1.44 గంటలకు భారతదేశం ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టింది. పాకిస్తాన్‌లోనూ, పాక్ ఆక్రమిత్ కశ్మీర్‌లోనూ ఉన్న 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. ఆ ఆపరేషన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా పర్యవేక్షించారు.
‘‘మా చర్యలు కేంద్రీకృతంగా, నిర్దుష్ట లక్ష్యాల మీద, కచ్చితంగా చేపట్టాము. అవి స్వభావరీత్యా ఇతరులను రెచ్చగొట్టేవి కావు. పాకిస్తాన్ సైనిక స్థావరాలను లక్ష్యం చేసుకోలేదు. లక్ష్యాలను ఎంచుకోవడం లోనూ, పథకం అమలులోనూ భారతదేశం తగినంత సంయమనం పాటించింది. పహల్‌గామ్ దాడికి బాధ్యులను పట్టుకోవడమే లక్ష్యంగా నిబద్ధతతో పనిచేసాం’’ అని భారత సైన్యం తమ ప్రకటనలో తెలియజేసింది.
పహల్‌గామ్‌లో హిందువులపై ముస్లిం ఉగ్రవాదుల దాడికి భారతదేశం స్పందనలో ఇది తొలి దశ మాత్రమేనని, పాకిస్తాన్ ప్రతిచర్యను బట్టి భారత్ మరిన్ని చర్యలు తీసుకుంటుందనీ విశ్వసనీయ వర్గాల సమాచారం.
మరోవైపు, పహల్‌గామ్ దాడి జరిగిన నాటి నుంచీ ఇరుదేశాల సరిహద్దుల దగ్గరా పాకిస్తాన్ కాల్పులు జరుపుతూనే ఉంది. ఇప్పుడు ఆపరేషన్ సిందూర్ తర్వాత వెంటనే అదే పనిని కొనసాగించింది. వాస్తవాధీన రేఖకు చేరువలో ఉన్న భారతదేశీయ గ్రామాల మీద కాల్పులు జరిపింది. ఆ దాడుల్లో ముగ్గురు అమాయక భారతీయ పౌరులు ప్రాణాలు కోల్పోయారు.
పాకిస్తాన్ ప్రధానమంత్రి షెబాజ్ షరీఫ్, భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌పై స్పందించారు. ‘‘భారతదేశం మామీద బలవంతంగా మోపుతున్న యుద్ధానికి స్పందించేందుకు మాకు ప్రతీ హక్కూ ఉంది. భారత్‌కు దీటైన సమాధానం ఇస్తున్నాం’’ అన్నారు.