గత నెల జమ్మూకశ్మీర్‌లోని పహల్‌గామ్‌లో జరిగిన ఘోరమైన ఉగ్రవాద దాడి తర్వాత భారత్ ఒకటొకటిగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఆ వరుసలో తాజాగా పాకిస్తాన్ నుంచి దిగుమతులపై పూర్తి స్థాయిలో నిషేధం విధించింది. జాతీయ భద్రత, ప్రభుత్వ విధానాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయాన్ని తక్షణం అమల్లోకి తీసుకొస్తున్నట్లు తెలియజేస్తూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్‌టీ) కార్యాలయం ఇవాళ ఒక ప్రకటన విడుదల చేసింది.
కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ విదేశీ వాణిజ్య విధానం 2023లో ఒక కొత్త అంశాన్ని చేర్చింది. దాని ప్రకారం పాకిస్తాన్‌లో తయారైన లేక పాకిస్తాన్ నుంచి ఎగుమతి అవుతున్న ఏ వస్తువులను అయినా సరే ప్రత్యక్షంగా లేక పరోక్షంగా దిగుమతి చేసుకోవడాన్ని భారతదేశం అన్నిరకాలుగా నిషేధించింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేవరకూ ఆ నిషేధం అమల్లో ఉంటుంది.
ఈ నిషేధం వల్ల భారత్, పాకిస్తాన్ రెండు దేశాల మధ్యా అన్ని రకాల వస్తువుల వాణిజ్యమూ నేటి నుంచే నిలిచిపోతుంది. అవి నిజానికి పూర్తిస్థాయిలో ఉచితంగా దిగుమతి చేసుకునేవి అయినా, లేక ఇతరత్రా అనుమతులు అన్నీ ఉన్నా… ప్రతీ వస్తువు మీదా ఆ నిషేధం వర్తిస్తుంది. అంటే పాకిస్తాన్ నుంచి భారత్‌లోకి ఒక్క వస్తువు కూడా దిగుమతి అవబోదు.
పరిస్థితి తీవ్రతను డీజీఎఫ్‌టీ తమ నోటిఫికేషన్ ద్వారా స్పష్టంగా తెలియజేసింది. ఆ నోటిఫికేషన్ ప్రకారం ఈ సమగ్ర నిషేధానికి మినహాయింపులు ఏమైనా కావాలంటే భారత ప్రభుత్వం నుంచి విస్పష్టమైన అనుమతులు ఉండాల్సిందే. ఈ క్లాజ్ వల్ల, పాకిస్తాన్ నుంచి దిగుమతుల మీద విధించిన నిషేధం పరిపూర్ణమైనదనీ, అది తక్షణం అమల్లోకి వస్తుందనీ స్పష్టమవుతోంది. అలాగే ప్రత్యేక పరిస్థితుల్లో ప్రత్యేక మినహాయింపు ఇచ్చే అవకాశం ఉంది, అయితే అత్యంత కఠోరమైన తనిఖీల తర్వాతే అలాంటి మినహాయింపు ఇవ్వవచ్చు.
ఈ ఆకస్మిక నిర్ణయం ఏప్రిల్ 22న పహల్‌గామ్ చేరువలోని బైసరన్ లోయ దగ్గర ఏప్రిల్ 22న ముస్లిం ఉగ్రవాదులు 24 మంది హిందువులు సహా మొత్తం 26 మందిని హతమార్చిన దారుణ ఘటన తర్వాత భారత ప్రభుత్వం తీసుకుంది. ఆ ఉగ్రదాడి మృతుల్లో దాదాపు అందరూ పర్యాటకులైన అమాయక భారత పౌరులే ఉన్నారు. అంతే తప్ప సైనికులు ఎవరూ లేరు.
ఆ దారుణమైన సంఘటన తర్వాత భారతదేశం వరుస పెట్టి పలు చర్యలు తీసుకుంది. దౌత్య చర్యల ద్వారా పాకిస్తాన్‌ను అంతర్జాతీయ సమాజం నుంచి ఒంటరిని చేసింది. వాటిలో ప్రధానమైనవి సార్క్ వీసా మినహాయింపు పథకాన్ని పాకిస్తానీ పౌరులకు సస్పెండ్ చేయడం, 1960 నాటి సింధు నదీ జలాల ఒప్పందానికి సంబంధించిన చర్చలను నిలిపివేయడం, ఇంకా ఇరు దేశాల మధ్యా ఏకైక రహదారి వాణిజ్య మార్గమైన అట్టారీ సరిహద్దు దగ్గర ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్ట్‌ను మూసివేయడం.
అట్టారీ – వాఘా సరిహద్దును మూసివేయడంతో ఇప్పటికే ద్వైపాక్షిక వాణిజ్యం బాగా దెబ్బ తింది. ఇక ఇవాళ్టి ప్రకటన తర్వాత పాకిస్తాన్ నుంచి భారత్‌కు ఎలాంటి దిగుమతులూ రావు. ఈ చర్య వల్ల భారత మార్కెట్ మీద ఆధారపడిన పాకిస్తానీ వ్యాపారాల మీద గణనీయమైన తీవ్ర దుష్ప్రభావం పడుతుంది.
ఈ నిర్ణయం ద్వారా భారత ప్రభుత్వం, సరిహద్దుల వెంబడి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దృఢమైన నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ఉగ్రవాదులను తయారు చేయడం, వారికి ఆశ్రయం ఇవ్వడం, వారితో భారత్ మీద దాడులు చేయించడం అనే పనులకు పాకిస్తాన్‌ను జవాబుదారీగా నిలుపుతోంది. దిగుమతులపై సమగ్ర నిషేధం ద్వారా పాకిస్తాన్ మీద ఆర్థికపరమైన ఒత్తిడి పెంచుతూ, భారత్ హింసాత్మక ఘటనలను ఎంతమాత్రం సహించబోదన్న స్పష్టమైన సందేశం పంపించింది.
ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రక్షణ శాఖ అధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో సైనిక బలగాలకు పూర్తిస్థాయి స్వేచ్ఛను ఇస్తున్నట్లు ప్రకటించారు. పహల్‌గామ్ ఉగ్రదాడికి భారతదేశం ఏ సమయంలో, ఏ లక్ష్యాల మీద, ఏ విధంగా స్పందించాలో అన్న నిర్ణయం తీసుకునే స్వేచ్ఛను సైనిక బలగాల నిర్ణయానికి వదిలి పెట్టినట్లు ప్రకటించారు. ఆ ప్రకటనతో పాటు కఠినమైన వాణిజ్య చర్యలను పరిశీలిస్తే భారతదేశం సరిహద్దులకు ఆవలి నుంచి ఎదురవుతున్న భద్రతా పరమైన సవాళ్ళను ఎదుర్కోడానికి బహుముఖీనమైన విధానాన్ని అమలు చేస్తోందని అర్ధమవుతోంది.