ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ కేరళలోని విళింజం అంతర్జాతీయ బహుళార్థ సాధక ఓడరేవును జాతికి అంకితం ఇచ్చారు. స్వతంత్ర భారత చరిత్రలో వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన మౌలిక సదుపాయాల కల్పనలో ఈ విళింజం సీపోర్ట్ నిర్మాణం గొప్ప విజయం అని చెప్పవచ్చు. ఈ ఓడరేవు పూర్తిస్థాయిలో పనిచేయడం మొదలైతే మన దేశానికి యేడాదికి గరిష్ఠంగా 22 కోట్ల డాలర్ల రెవెన్యూ ఆదా అవుతుంది.
భారతదేశపు దక్షిణాగ్రాన కేరళలో వ్యూహాత్మకంగా కీలక ప్రాంతమైన విళింజంలో ఈ ఓడరేవును నిర్మించారు. దాని విలువ 8,900 కోట్ల రూపాయలు. ఇది భారతదేశపు మొట్టమొదటి సెమీ ఆటోమేటెడ్ డీప్‌వాటర్ ఆల్-వెదర్ ట్రాన్స్‌షిప్‌మెంట్ పోర్ట్. దక్షిణాసియా సముద్ర వాణిజ్యాన్ని గణనీయంగా మార్చివేసే సమర్ధత ఈ విళింజం పోర్ట్ ప్రత్యేకత. భారతదేశం ఇన్నాళ్ళూ కొలంబో, సింగపూర్, దుబాయ్ వంటి విదేశీ ట్రాన్స్‌షిప్‌మెంట్ హబ్స్ మీద ఆధారపడుతూ వచ్చింది. ఇప్పుడు విళింజం ఓడరేవుతో ఆ లోటు తీరిపోయింది. పూర్తి స్థాయి భారతీయ ట్రాన్స్‌షిప్‌మెంట్ హబ్‌గా విళింజం పోర్ట్‌ను తీర్చిదిద్దారు.
ఈ రేవును ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంలో అభివృద్ధి చేసారు. 2015 డిసెంబర్ 5న అదానీ విళింజం పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఈ రేవును నిర్మించే ప్రాజెక్టును ప్రారంభించింది. డిజైన్-బిల్డ్-ఫైనాన్స్-ఆపరేట్-ట్రాన్స్‌ఫర్… అంటే పోర్టు డిజైనింగ్ దగ్గర నుంచి నిర్వహణ వరకూ ఈ రేవు బాధ్యతను మొత్తం అదానీ సంస్థే చేపట్టింది. ప్రభుత్వం దార్శనికత, ప్రైవేటు రంగం సృజనాత్మకత, వ్యూహాత్మక ఆలోచనల సమ్మేళనంగా ఈ పోర్టు భారతీయ మౌలిక సదుపాయాల రంగంలో ఓ కొత్త శకాన్ని ఆవిష్కరించింది.
విళింజం రేవు ప్రారంభోత్సవం సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘‘ఇది కేవలం ఓడరేవు కాదు, వ్యూహాత్మకంగా మనకు బలమైన రక్షణ. ఆర్థిక ప్రగతికి చోదకశక్తి, అంతర్జాతీయ వాణిజ్యానికి ముఖద్వారం. వికసిత భారతానికి విళింజం ఒక నిదర్శనం. స్వయంసమృద్ధికి, భవిష్యత్ అవసరాల సంసిద్ధతకు, అంతర్జాతీయ పోటీకి విళింజం సిద్ధంగా ఉంది’’ అని వ్యాఖ్యానించారు.
విళింజం ఓడరేవు ప్రారంభోత్సవం, జాతికి అంకితం చేసే కార్యక్రమంలో కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్, రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్, కేరళ ఓడరేవుల మంత్రి విఎన్ వాసవన్, తిరువనంతపురం మేయర్ ఆర్యా రాజేంద్రన్, తదితరులు పాల్గొన్నారు.
విళింజం పోర్ట్ సాధారణ ఓడరేవు కాదు. అది భారతదేశపు మొట్టమొదటి సెమీ ఆటోమేటిక్ కంటెయినర్ పోర్ట్. అందులో అత్యాధునికమైన కార్గో హ్యాండ్లింగ్ వ్యవస్థలు, అడ్వాన్స్‌డ్ క్రేన్‌లు, స్మార్ట్ లాజిస్టిక్స్ టెక్నాలజీ ఉన్నాయి. ఓడలు తక్కువ సమయంలో ప్రవేశించి బైటకు వెళ్ళిపోయే సమర్ధత కలిగి ఉంది. ఆ ఓడరేవులో సహజంగా ఉన్న 20 మీటర్ల డ్రాఫ్ట్ డెప్త్ (లోతు) వల్ల ప్రపంచంలోనే పెద్దవైన కంటెయినర్ షిప్స్ సైతం ఎలాంటి డ్రెడ్జింగ్, శ్లాషింగ్ అవసరం లేకుండా సులువుగా ప్రవేశించగలవు, త్వరగా సరుకును దింపి బైటకు వెళ్ళిపోగలవు. దానివల్ల మెయింటెనెన్స్, ఆపరేషనల్ కాస్ట్‌లు గణనీయంగా తగ్గుతాయి. దాంతో పెద్ద ఓడలు విళింజం రేవు ద్వారా ఆపరేషన్స్ చేపట్టడానికి ఆసక్తి చూపుతాయి.
ఈ సౌలభ్యం వల్ల విళింజం అంతర్జాతీయ రేవులతో నేరుగా పోటీ పడగలదు. ఆటోమేటెడ్ బెర్తింగ్ వ్యవస్థలు, ఎక్కువ సమర్థత కలిగిన క్రేన్‌లు, రియల్‌టైమ్ లాజిస్టిక్స్ ట్రాకింగ్ వంటి సౌకర్యాలతో విళింజం పోర్ట్ నేరుగా సింగపూర్, రోటర్‌డాం ఓడరేవులతో పోటీ పడగలదు.
విళింజం ఓడరేవు అంతర్జాతీయ నౌకా వాణిజ్యంలో కీలకమైన ప్రాక్-పశ్చిమ అక్షానికి కేవలం 10 నాటికల్ మైళ్ళ దూరంలో ఉంది. అది ప్రకృతి భారతదేశానికి భౌగోళికంగా ప్రసాదించిన వరం. ఐరోపా, పర్షియన్ అఖాతం, ఆగ్నేయ ఆసియాలను కలిపే సముద్ర మార్గంలో ఉండడం వల్ల అంతర్జాతీయ సరకు రవాణా కేంద్రాల్లో ప్రధాన స్థావరంగా నిలుస్తుంది. దేశానికి స్వతంత్రం వచ్చిన ఇన్నేళ్ళ వరకూ భారతదేశపు సరకు రవాణాలో 75శాతం విదేశీ ఓడరేవుల నుంచే జరిగేది. ఆ పరిస్థితి ఇకపై మారనుంది.
‘‘ఈ రేవు సాగర వాణిజ్య మార్గాల్లో భారతదేశ సామర్ధ్యాన్ని బలోపేతం చేస్తుంది. జాతీయ లాజిస్టిక్స్‌ను, వాణిజ్య దౌత్యాన్ని, ప్రాదేశిక సమతూకాన్నీ ఈ ఓడరేవు నాలుగు రెట్లు పెంచగలదు’’ అని షిప్పింగ్ శాఖలో సీనియర్ అధికారి ఒకరు వివరించారు.
భారతదేశం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ‘సాగర మాల’ కార్యక్రమంలో విళింజం కీలక పాత్ర పోషిస్తుంది. తీర ప్రాంత షిప్పింగ్‌కు ఊతమిస్తుంది. పారిశ్రామిక క్లస్టర్లకు, మల్టీమోడల్ లాజిస్టిక్స్‌కూ ఆసరాగా నిలుస్తుంది. సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థ – బ్లూ ఎకానమీని గణనీయంగా పెంచుకోడానికి భారతదేశం చేస్తున్న ప్రయత్నాల్లో ప్రధానమైన మారిటైమ్ నోడ్‌గా విళింజం నిలుస్తుంది. ఉద్యోగ అవకాశాల కల్పన, ఎగుమతుల అభివృద్ధితో పాటు రక్షణ రంగ మౌలిక సదుపాయాల కల్పన ద్వారా జాతీయ భద్రతను పెంపొందించడంలో కీలకంగా నిలుస్తుంది.
విళింజం పోర్ట్ కొద్ది కాలంలోనే భారతదేశపు ప్రధాన ట్రాన్స్‌షిప్‌మెంట్ హబ్‌గా నిలుస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. సరకు రవాణా రంగంలో ఈ రేవు కేవలం భారతదేశానికే కాక బంగ్లాదేశ్, శ్రీలంక, ఇంకా మధ్య ఆసియా, ఆఫ్రికాలోని ల్యాండ్-లాక్డ్ దేశాలకు సేవలు అందించగలదు.
విళింజం ఓడరేవు ఏర్పాటు వల్ల భారతదేశం ఇకపై విదేశీ ఓడరేవుల మీద ఆధారపడడం గణనీయంగా తగ్గిపోతుంది. ప్రస్తుతం భారతదేశం ఏటా 30లక్షల టీఈయూల సరుకును ఓడల ద్వారా రవాణా చేస్తోంది. (టీఈయూ = ట్వంటీఫుట్ ఈక్వీవలెంట్ యూనిట్స్) ఆ కార్గో ట్రాన్స్‌షిప్‌మెంట్ కోసం మన దేశం ఇన్నాళ్ళూ శ్రీలంక, తదితర దేశాలలోని ఓడరేవుల మీద ఆధారపడుతూ వచ్చింది. దానివల్ల విలువైన విదేశీ మారక ద్రవ్యాన్ని భారీ మొత్తంలో ఖర్చు పెట్టాల్సి వచ్చేది. పైగా, మన ఎగుమతుల కోసం ఎప్పటికప్పుడు విదేశీ ఓడరేవుల మీదనే ఆధారపడుతూ ఉండాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఆ కథ మారిపోయింది. భారత్ నుంచి ఎగుమతి చేసే సరుకులు అన్నింటినీ ఇకపై దేశీయంగా విళింజం రేవు నుంచే పంపించవచ్చు. తద్వారా వందల కోట్ల విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుంది. అంతేకాదు, సముద్ర వాణిజ్య మార్గాలు ఇకపై భారతదేశపు నియంత్రణలోకి వస్తాయి.
‘‘విళింజం ఒక ఓడరేవు, ట్రాన్స్‌షిప్‌మెంట్ హబ్ మాత్రమే కాదు. అది ఒక ప్రకటన. ఈ రేవు ద్వారా మనం మన దేశానికి వెనక్కి తీసుకొచ్చే ప్రతీ కంటెయినరూ ఆర్థిక స్వావలంబనకు, సార్వభౌమత్వానికీ ఊతంగా నిలబడుతుంది’’ అని సీనియర్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.