అమరావతి రాజధాని నిర్మాణ పనులకు ప్రధాని మోదీ మరికాసేపట్లో రానున్నారు. వెలగపూడి సచివాలయం సమీపంలో ఏర్పాటు చేసిన సభకు అంతా సిద్దం చేశారు.కనీసం 5 లక్షల మంది ప్రజలు ఈ కార్యక్రమానికి వస్తారని అంచనా. ఇప్పటికే వేలాది మంది జనం అమరావతికి చేరుకుంటున్నారు. రాజధాని గ్రామాల రైతులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వయంగా ఆహ్వానించారు. కుటుంబ సమేతంగా రావాలంటూ ఆహ్వానాలు పంపడంతో రైతులు పెద్ద ఎత్తున ర్యాలీగా సభ వద్దకు బయలు దేరారు.
రాయలసీమ ప్రాంతం నుంచి వస్తున్న వారిని గుంటూరు నుంచి 16వ నెంబరు జాతీయ రహదారి గుండా అమరావతికి తరలిస్తున్నారు. ఉత్తరాంధ్ర ప్రజల కోసం విజయవాడ వెస్ట్ బైపాస్ తెరిచారు. గొల్లపూడి వద్ద కొత్తగా నిర్మించిన వంతెనపై ప్రధాని సభ కోసం ప్రజలను వదిలారు. దీంతో ఆరు జిల్లాల ప్రజలకు సభకు సులువుగా చేరుకునే అవకాశం లభించింది.
ప్రధాని మోదీ సభకు 10 వేల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. రాజధాని ప్రాంతాన్ని న్లో ఫ్లయింగ్ జోన్‌గా ప్రకటించారు. డోన్లతో ప్రధాని భద్రతను పర్యవేక్షిస్తున్నారు. సాయంత్రం 3 గంటలకు గన్నవరం చేరుకుని, అక్కడ నుంచి హెలికాఫ్టర్ ద్వారా సభా స్థలం వద్ద ప్రధాని చేరుకుంటారు. 4 గంటల నుంచి 5 గంటల వరకు సభ, అమరావతి రాజధాని నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు ప్రధాని మోదీ తిరిగి ఢిల్లీ బయలుదేరుతారు.