పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత పాకిస్తాన్ సంబంధాల గురించి భారత సంతతికి చెందిన బ్రిటిష్ ఎంపీ లార్డ్ మేఘనాద్ దేశాయ్ స్పందించారు. కశ్మీర్ వివాదాన్ని శాశ్వతంగా రూపుమాపాలంటే పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని భారతదేశానికి సూచించారు. అన్ని సమస్యలకూ అదే పరిష్కారమని ఆయన వ్యాఖ్యానించారు. ఉగ్రవాదులను శిక్షించడానికి, పహల్గామ్ వంటి చర్యలు మళ్ళీ జరగకుండా చూడడానికీ.. భారత్ కఠినంగా ఉండాలని ఆయన సూచించారు కోరారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ ఎప్పటికీ భారతదేశానిదేనని ఆయన స్పష్టం చేసారు.
పహల్గాంలో పర్యాటకులపై జరిగిన దాడిని మేఘనాద్ ఖండించారు. కశ్మీర్ వివాదంలో అదే ఆఖరిది కావాలని ఆశాభావం వ్యక్తంచేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని తాను నమ్ముతున్నానని అన్నారు. కశ్మీర్‌లో ఉన్న సమస్యల్ని శాశ్వతంగా పరిష్కరిస్తానని ప్రధాని ఇప్పటికే పలుమార్లు చెప్పారని గుర్తు చేశారు.
మరోవైపు, పహల్గాం ఉగ్రదాడి నేరస్థులకు కఠిన శిక్ష విధించాలని భారత్‌ను కోరుతున్నామని బ్రిటన్ విదేశాంగ శాఖ పేర్కొంది. ఉగ్రవాద నిర్మూలనలో న్యూఢిల్లీకి ఎప్పుడూ అండగా ఉంటామంది. పహల్గాం ఘటనకు వ్యతిరేకంగా లండన్‌లో భారతీయుల నిరసన సందర్భంలో అక్కడి పాకిస్తాన్ హైకమిషన్ అధికారి వారిని బెదిరించడం తమను ఆందోళనకు గురి చేసిందని తెలిపింది. ఆ ఘటనపై విచారణ జరుపుతున్నామని వెల్లడించింది.