ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమరావతి పర్యటనకు ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయని ఆంధ్రప్రదేశ్ మంత్రి పొంగూరు నారాయణ తెలియజేసారు. ఇవాళ ఆయన ఉన్నతాధికారులతో కలిసి ప్రధానమంత్రి పాల్గొనే బహిరంగ సభ వేదిక వద్ద ఏర్పాట్లను పరిశీలించారు.
ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంత్రి నారాయణ… ప్రధాని సభకు ఏర్పాట్లలో రవాణా,పార్కింగ్ కీలకమన్నారు. వర్షం వస్తే పార్కింగ్‌కు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయం చూడాలని సీఎం సూచించారని, ఆ విషయమై పోలీస్ అధికారులకు ఆదేశాలిచ్చామనీ తెలియజేసారు. ప్రధానమంత్రి సభకు 3వేల బస్సులు, వెయ్యి కార్లకు పార్కింగ్ ఏర్పాట్లు ముందుగా చేశామని మంత్రి చెప్పారు. మే 2న జరగబోయే ఆ సభకు 5లక్షలకు పైగా ప్రజలు హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దానికి తగినట్లు పార్కింగ్‌కు మరిన్ని ప్రాంతాలు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తానికి గరిష్ఠంగా 7వేల బస్సులు, 3వేల కార్లకు పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రోటోకాల్ ప్రకారం అందరికీ ఆహ్వానిస్తున్నామని మంత్రి వెల్లడించారు. అమరావతి రాజధాని పనుల పునఃప్రారంభోత్సవానికి అన్ని శాఖలూ సమన్వయంతో పని చేస్తున్నాయని నారాయణ తెలియజేసారు.