అమరావతి రాజధానికి చట్టబద్దత కల్పించాలంటూ భూములిచ్చిన రైతుల డిమాండ్ పై సీఎం చంద్రబాబునాయుడు స్పందించారు. విభజన చట్టంలో మార్పులు తీసుకురావడానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తామని చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. అమరావతి రాజధాని పున:నిర్మాణ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపనకు వచ్చిన సమయంలో ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళతానని రాజధాని రైతులకు సీఎం చంద్రబాబునాయుడు భరోసా ఇచ్చారు. అమరావతి పున:నిర్మాణ పనులకు ప్రధాని మోదీ మే 2వ తేదీన శంకుస్థాపన చేయనున్న విషయం తెలిసిందే.రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి రైతులు కుటుంబ సమేతంగా హాజరు కావాలని సీఎం ఆహ్వానించారు.
అమరావతి రాజధానిని భవిష్యత్తులో మరెవరూ మార్చకుండా చట్టబద్దత కల్పించాలని భూములిచ్చిన రైతులు కోరుతున్నారు. విభజన తరవాత హైదరాబాద్ నగరం పదేళ్లు రాజధానిగా ఉంది. ప్రస్తుతం సమయం ముగిసింది కాబట్టి అమరావతి రాజధానికి చట్టబద్ధత అంశం చర్చకు రాకపోవచ్చని సీఎం చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు.