జమ్ముకశ్మీర్ పహల్గాం ఉగ్రదాడి తరవాత పాకిస్థాన్‌పై భారత్ కఠిన ఆంక్షలు మరింత పెంచింది. తాజాగా పాక్ నుంచి ప్రసారం అవుతున్న యూట్యూబ్ ఛానళ్ల ప్రసారాలను భారత్‌లో నిలిపివేసింది. పాక్ న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్‌కు చెందిన 16 ఛానళ్ల ప్రసారాలు నిలిపివేసినట్లు హోం శాఖ ప్రకటించింది. దేశ భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం ప్రకటించింది. దేశ వ్యతిరేక కథనాలు ప్రసారం చేస్తోన్న పాక్ జాతీయుల ఛానళ్లు యూట్యూబ్‌లో ప్రసారం కావడం లేదు.
జియో న్యూస్, సామా టీవీ, డాన్ న్యూస్ మీడియా ఛానళ్లతోపాటు, పాక్ జర్నలిస్టుల యూట్యూబ్ ఛానళ్ల ప్రసారాలను నిలిపివేశారు. మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ఛానల్ ప్రసారాలు నిలిచిపోయాయి.
పహల్గాం ఉగ్రదాడి తరవాత పాక్ ప్రభుత్వ అధికారిక ఎక్స్ ఖాతాను నిలిపేసిన భారత్, తాజాగా పాక్ గడ్డపై నుంచి ప్రసారం చేస్తోన్న విష ప్రచారానికి తెర దింపింది. ఇప్పటికే సింధు నది జలాల ఒప్పందం రద్దుతోపాటు, నీటి విడుదల నిలిపివేసిన కేంద్రం పాక్‌పై ముప్పేట దాడికి సిద్దమవుతోంది.