జమ్ముకశ్మీర్ పహల్గాంలో పర్యాటకులపై విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డ ఉగ్రవాదుల ఊహా చిత్రాలను దర్యాప్తు సంస్థలు విడుదల చేశాయి. దాడులకు దిగిన వారిలో ఆసిఫ్ ఫౌజి, సులేమాన్ షా, అబు తాలా ఉన్నారు. మూసా, ఆసీఫ్, యూనిస్ అనే మార్లు పేర్లు కూడా వీరికి ఉన్నాయని నిఘా సంస్థలు తెలిపాయి. జమ్ముకశ్మీర్ కేంద్రంగా పనిచేసే ది రెసిస్టెన్స్ ఫ్రంట్లో సభ్యులుగా ఉన్నారు.
ఉగ్రదాడి నుంచి బయట పడిన ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన వివరాల మేరకు ఊహా చిత్రాలను రూపొందించారు. టెర్రరిస్టులు పురుషులను వేరు చేసి గుర్తింపులను పరిశీలిస్తున్న సమయంలో ప్రత్యక్ష సాక్షులు వారి ముఖాలను చూశారు. ఊహా చిత్రాల ఆధారంగా సైన్యం వేట కొనసాగిస్తోంది. ఓ ఉగ్రవాది ఆటోమేటెడ్ తుపాకీతో ఉన్న ఫోటో కూడా విడుదలైంది.
వీలైనంత ఎక్కువ మంది ప్రాణాలు బలితీసుకునేందుకు ఉగ్రవాదులు బైసరన్ లోయను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతంలో భద్రత అంతగా ఉండదని గుర్తించారు. పహల్గాం నుంచి ఆ ప్రాంతానికి రావాలంటే సుమారు 6 కిమీ పైగా నడవాల్సి ఉంటుంది. లోయ చుట్టూ అటవీ ప్రాంతం ఉండటం కూడా పారిపోవడానికి అనువైన ప్రాంతంగా ఎంచుకున్నారు.
దాడిని బాడీ కెమెరాలతో ఉగ్రవాదులు చిత్రీకరించినట్లు బలగాలు గుర్తించాయి. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు కాల్పులకు తెగబడ్డారు. వారు హెల్మెట్లు ధరించినట్లు కొందరు చెబుతున్నారు. పర్యాటకులను అందరినీ ఒకచోటుకు చేర్చి, మగవారిని వేరు చేశారు. తనిఖీలు నిర్వహించారు. తరవాత కాల్పులకు తెగబడ్డారు. స్నైపర్ టెక్నిక్ ద్వారా కొందరూ దూరం నుంచి కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.