జమ్ముకశ్మీర్ ఉగ్రదాడి ఘటన విషయం తెలియగానే ప్రధాని నరేంద్ర మోదీ సౌదీ అరేబియా పర్యటన ముగించుకుని ఢిల్లీకి చేరుకున్నారు. విమానాశ్రయంలోనే కీలక అధికారులతో భేటీ అయ్యారు. విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీతో ప్రధాని మోదీ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఉగ్రదాడిపై తదుపరి చర్యల గురించి చర్చించారు. దాడి జరిగిన తీరును ప్రధానికి వివరించారు.
ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీ నేతృత్వంలో భద్రతా వ్యవహారాల కేంద్ర క్యాబినెట్ అత్యవసర సమావేశం నిర్వహించనుంది. అమెరికా పర్యటనలో ఉన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన ముగించుకుని ఢిల్లీకి బయలుదేరారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా శ్రీనగర్ చేరుకుని దగ్గరుండి పరిస్థితులను సమీక్షిస్తున్నారు. భద్రతాధికారులకు ఎప్పటి కప్పుడు సలహాలు అందిస్తూ గాయపడిన వారికి మెరుగైన చికిత్సకు ఆదేశిరంచారు.
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడి జరిగిన పహల్గాం ప్రాంతానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇవాళ చేరుకోనున్నారు. అక్కడ పర్యటిస్తారని తెలుస్తోంది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు సైనిక దుస్తుల్లో పహల్గాం వచ్చిన ఉగ్రమూకలు విచక్షణా రహితంగా విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ముష్కరులదాడిలో ఇప్పటి వరకు 28 మంది ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన వారిలో 19 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.