బంగారం ధర మరోసారి భారీగా పెరిగింది. మాఘమాసం కావడంతో శుభకార్యాలు విరివిగా జరుగుతున్నాయి. దీంతో బంగారం కొనేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపుతున్నారు. దిల్లీ బులియన్ మార్కెట్లో శుక్రవారం నాడు 99.9 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర రూ.1,100 పెరిగింది. దీంతో రూ.85 వేలకు చేరువైంది. మార్కెట్ ముగిసే సమయానికి పదిగ్రాముల ధర రూ.84,900గా నమోదైంది. జనవరి 1న పుత్తడి ధర రూ.79,390 గా ఉంది.
హైదరాబాద్‌లో 24 క్యారెట్ బంగారం పదిగ్రాముల ధర రూ.1,310 రూ.84,330 పలికింది. అంతకుముందు ఇది రూ. 83 వేలుగా ఉంది. అలాగే 22 క్యారెట్ విలువ రూ.1,200 ఎగబాకి రూ. 77,300కి చేరింది.
వెండి ధర కూడా పైపైకి…
పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు పెరగడంతో వెండి ధర రూ.95 వేలు పలికింది. కిలో ధర రూ.850 పెరిగింది. అంతకుముందు ఇది రూ.94,150గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.1,000 ఎగబాకి రూ.1.07 లక్షలు పలికింది.
మెక్సికో, కెనడాలపై అమెరికా సుంకాలను విధించడంతో పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను సురక్షితమైన బంగారం వైపు మళ్లిస్తున్నారని అందుకే పుత్తడి ధర పెరగడానికి ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. దేశాల సెంట్రల్ బ్యాంకులు వడ్డీరేట్లను తగ్గిస్తుండటం కూడా మరో కారణం.