Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home ఆధ్యాత్మికం

కంచి పరమాచార్య: రాజ్యాంగంలో మత రక్షణకు మహత్తర కృషి

Phaneendra by Phaneendra
May 24, 2024, 05:46 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

(ఇవాళ కంచి పరమాచార్యుల 131వ జయంతి సందర్భంగా…)

 

భారతదేశంలో మతం మనుగడకు రాజ్యాంగరక్షణ చేకూరింది. మన రాజ్యాంగంలో మతం ప్రజల ప్రాథమిక హక్కుగా పరిగణన పొందింది. అయితే అందుకు ప్రధాన బాధ్యులెవ్వరో దేశం మొత్తం మీద తెలిసినవారు ఎందరో లేరు.

1947లో కామకోటి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి తపోబలంతో ఆ లక్ష్యం ఎలా సాధింపబడిందో, వేదరహస్య సంవేదీ, మహాపండితుడూ శ్రీమాన్ అగ్నిహోత్రం రామానుజ తాతాచారిగారు ఈ వ్యాసంలో వెల్లడించిన విషయాలు అద్భుతావహాలు.

హిందూమతసంరక్షణకు శ్రీ కంచికామకోటిపీఠ పరమాచార్యులు, జగద్గురు శ్రీ చంద్రశేఖరేంద్రసరస్వతి స్వామివారు చేసిన మహత్తర సేవలను తెలుసుకోవాలంటే భారత స్వాతంత్ర్యోద్యమం నాటి దేశ పరిస్థితులను జ్ఞాపకం చేసుకోవాలి.

చిన్నతనంలోనే సన్యసించి కంచికామకోటి మఠాధిపత్యం వహించడం వల్ల స్వామివారు ప్రత్యక్షంగా దేశ రాజకీయాలలో పాల్గొనలేదు. అయినా భారత స్వాతంత్ర్యాన్ని వారు మనఃపూర్వకంగా వాంఛించారు. దానిని బలపరిచారు.

స్వామివారు ఆశించింది ఇండియాలో విదేశీపాలన అంతరించడం మాత్రమే కాదు. మన దేశీయ హృదయాలలో పాదుకున్న విదేశీయ, విజాతీయ వ్యామోహం కూడా అంతరించాలని వారు గాఢంగా వాంఛించారు.

గాంధీగారు విదేశీవస్త్రబహిష్కరణను ప్రారంభించిన నాటినుండి స్వామి స్వయంగా ఖద్దరునే ధరిస్తున్నారు. దురదృష్టవశాన జాతీయోద్యమ నాయకులు రాజకీయాలకే సర్వప్రాధాన్యమిచ్చి, మతం పట్ల ఉపేక్ష వహించారు. అందువల్ల మనకు స్వాతంత్ర్యం సిద్ధించిననాడు మన మతానికీ, ఆధ్యాత్మిక ప్రయోజనాలకూ హాని వాటిల్లవచ్చునని స్వామివారు అనుమానించారు. ఈ విషయమై శ్రీ కామకోటి స్వామి పలువురు రాజకీయనాయకులను హెచ్చరించారు. కాని వారి హెచ్చరికలను నాయకులంతగా పాటించలేదు. రాజకీయాలు మినహా ఇతర సమస్యలకు ప్రాధాన్యం లేని నాటి క్లిష్ట పరిస్థితులలో మన మత సంరక్షణకై కంచిస్వామి వారొక్కరే అవిశ్రాంతంగా పాటుపడక తప్పలేదు.

భారత రాజ్యాంగ నిర్మాణదశలో కంచి పీఠాధిపతి ప్రదర్శించిన అసదృశ రాజకీయ పరిజ్ఞానం వల్లనే నేడు మన రాజ్యాంగ చట్టంలో మత స్వాతంత్ర్యానికీ, మతసంస్థల సంరక్షణకూ నియమనిబంధనలు స్థిరంగా నెలకొన్నవి. ఈ సందర్భంగా శ్రీ స్వామివారు సల్పిన నిరాడంబర కృషిని విజ్ఞప్రపంచానికి వెల్లడించడం నా కర్తవ్యంగా భావిస్తున్నాను.

 

స్వామి భవిష్యద్వాణి

మత స్వాతంత్ర్యానికీ, మత సంస్థల సంరక్షణకూ రాజ్యాంగ ప్రామాణికతను సమకూర్చాలనే లక్ష్యసాధనలో అయిదేళ్ళు స్వామివారెంత నిర్విరామంగా పాటుపడినారో నేనెరుగుదును. కుంభకోణం సమీపాన వేలూరు అనే పల్లెటూళ్ళో ఒక అర్ధరాత్రివేళ తమ సాన్నిధ్యంలో ఉన్న మమ్ము నుద్దేశించి స్వామివారు చేసిన ఈ హెచ్చరిక నేటికీ నా చెవులలో మారుమ్రోగుతున్నది. ‘‘భారత రాజ్యాంగం ద్వారా మన మతాన్ని కాపాడుకొనడం మన తక్షణ కర్తవ్యం. ఇది ఎంతమాత్రం ఉపేక్షించవలసిన విషయం కాదు’’.

ఈ హెచ్చరిక ప్రాముఖ్యాన్ని ఆనాడు మేమంతగా గుర్తించలేదు. కాని తరువాత కొద్ది రోజులలోనే జరిగిన సంఘటనలు స్వామి భవిష్యద్వాణిని అక్షరాలా ధ్రువీకరించినవి. భారత స్వాతంత్ర్యాన్ని గురించి, ప్రత్యేకించి భారతదేశానికి నూతన రాజ్యాంగ నిర్మాణాన్ని గురించి చర్చించడానికి బ్రిటిష్ ప్రభుత్వం మన దేశానికి ఒక రాయబార వర్గాన్ని పంపింది.

ఆ సందర్భంలో తమ కర్తవ్యమేమిటో కామకోటి శంకరాచార్యులు తప్ప తక్కిన మఠాధిపతులెవ్వరూ గుర్తించలేదు. బ్రిటిషు రాయబారవర్గ సభ్యులను కలసుకొని మనదేశంలో గల మతసంస్థల పరిస్థితులను గురించి, భవిష్యత్తులో వాటి ప్రతిపత్తి గురించీ రాయబారవర్గ సభ్యులకు నచ్చ చెప్పవలసినదిగా స్వామివారు మమ్ము ఆదేశించారు.

కాని, బ్రిటిషు రాయబారవర్గం మా విజ్ఞప్తిని ఆలకించడానికైనా అవకాశం ఇస్తుందా అని మేము సందేహించాము. ఏమైనప్పటికీ, జరగవలసినదేదో జరగనిమ్మని, స్వామివారి ఆదేశం మేరకు రాయబారవర్గానికి టెలిగ్రాములు పంపాము. మేము ఊహించినట్టే జరిగింది. మా టెలిగ్రాములకు వారు సమాధానం కూడా ఇవ్వలేదు. అయినా స్వామివారు మావలె నిరాశ చెందలేదు. ఆయన ఆత్మవిశ్వాసం మాకు ఆశ్చర్యం కలిగించింది. అది మా అల్పజ్ఞతకు నిదర్శనం. స్వామి సంకల్పం అమోఘం. అది వారికే విదితం.

 

అద్భుత సన్నివేశం

ఇంతలో తలవని తలంపుగా ‘‘తక్షణం మద్రాసు బయలుదేరి రావలసింది’’ అంటూ ‘‘హిందూ’’ పత్రిక కార్యాలయం నుంచి నాకు టెలిగ్రాం వచ్చింది. నేను మద్రాసు చేరి ‘‘హిందూ’’ కార్యాలయంలో అడుగు పెట్టినానో లేదో, అప్పటి ‘‘హిందూ’’ సంపాదకులు శ్రీ కస్తూరి శ్రీనివాసన్ నాకు ఎదుటపడి, బ్రిటిష్ పార్లమెంటరీ రాయబారవర్గం మరికొన్ని నిముషాలలో తమ కార్యాలయం దర్శించబోతున్న వార్త నా చెవిన వేశారు. ఆనాడు రాయబారవర్గ సభ్యుల గౌరవార్థం ‘‘హిందూ’’ కార్యాలయంలో ఒక తేనీటివిందు ఏర్పాటు చేశారు. ఏ రాయబారవర్గం వారు మేము పంపిన టెలిగ్రాములకు సమాధానమైనా పంపకుండా తటస్థంగా ఉన్నారో, వారే మరికొన్ని క్షణాల్లో అక్కడ నాకు కనబడే అద్భుత సన్నివేశం అప్పటికప్పుడు ప్రత్యక్షమైంది. రాయబారవర్గం కార్యదర్శికి కస్తూరి శ్రీనివాసన్ నన్ను పరిచయం చేశారు. ‘‘మా టెలిగ్రాములు ఒక్కదానికైనా మీరు జవాబివ్వలేదు’’ అని వారితో నేనన్నాను. రాయబారవర్గ సభ్యులందరిలో ప్రముఖుడైన బ్రిటిష్ పార్లమెంటు సభ్యుడు శ్రీ సోరెన్‌సెన్‌కు స్వయంగా మా విజ్ఞప్తిని వినిపించవచ్చునని ఆయన నాకు సలహా ఇచ్చారు. ఈ వ్యవహారమంతా శరవేగంగా జరిగిపోవడం వల్ల మా విజ్ఞాపనను వ్రాతమూలకంగా వారికి సమర్పించడానికి వీలుపడలేదు. భారతదేశంలో మతసంస్థల నిస్సహాయ స్థితిని గురించి నోటిమాటతోనే శ్రీ సోరెన్‌సెన్‌కు సంగ్రహంగా చెప్పి          మతసంస్థలకు రాజ్యాంగ రక్షణ అవసరమన్న శ్రీ కామకోటి పీఠాధిపతుల ఆశయాన్ని వారికి విశదపరిచాను. మరొక్కసారి తనను ఢిల్లీలో కలుసుకొనవలసిందని ఆయన నాతో అన్నారు.

 

మతం ప్రాథమిక హక్కు!

ఆశ్చర్యకరంగా జరిగిన ఈ కథ యావత్తూ స్వామివారికి వినిపించాలని హుటాహుటి కంచికి తిరిగి వచ్చాను. నేను చెప్పినదంతా స్వామి విన్నారు. ఒక్కక్షణం ధ్యానంలో ఉన్నారు.

అటు తరవాత ‘మతాన్ని ప్రాథమిక హక్కు’గా పరిగణించవలసిందని కోరుతూ ఒక విజ్ఞాపన తయారు చేయవలసిందని మమ్మాదేశించారు.

మతమా! ప్రాథమిక హక్కా! ప్రాథమిక హక్కులను గురించి దేశంలో అప్పటికి మేధావివర్గాలలో సైతం ఆలోచనలు బయలుదేరలేదు. కాగా మతాన్ని ‘ప్రాథమిక హక్కు’గా పరిగణించడం గురించి యోచించినవారు అసలే లేరు. ఆ మాటకొస్తే భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల అవతరణకు ఇదే నాందివాక్యమనడం కూడ అతిశయోక్తి కాదు.

 

సోరెన్‌సెన్ ఆనందం

నేను ఢిల్లీ వెళ్ళి శ్రీ సోరెన్‌సెన్‌ను కలుసుకొని, మా విజ్ఞాపన పత్రాన్ని ఆయనకు అందజేశాను. భారత ప్రజానీకం పట్ల శ్రీ కంచి శంకరాచార్య స్వామికి గల ప్రేమానురాగాల గురించీ, అసాధారణమైన వారి లౌకిక పరిజ్ఞానాన్ని గురించీ సోరెన్‌సెన్ ఆశ్చర్యం వెలిబుచ్చి, ఆనందభరితుడైనాడు.

బ్రిటిష్ రాయబారవర్గం వారు ఏ ప్రయత్నంతో వచ్చారో, ఆ ప్రయత్నం ఫలించలేదు. కాని, మతవిశ్వాసాన్ని ప్రాథమిక హక్కుగా పరిగణించాలన్న సూత్రం మాత్రం సుస్థిరంగా, అసందిగ్ధంగా నాయకుల హృదయాల్లో నాటుకుపోయింది. జగద్గురు శ్రీ కామకోటి శంకరాచార్యుల అమోఘ సంకల్పమే అందుకు మూలం. అంతట, రథం ముందుకు సాగింది.

 

స్వామి తపోబలం

మరికొంతకాలం గడిచింది. ఈసారి బ్రిటిష్ మంత్రివర్గ రాయబార సభ్యులు మన దేశానికి అరుదెంచారు. ఆ రాయబార వర్గానికి అధ్యక్షుడైన సర్ స్టాఫర్డ్ క్రిప్స్‌ను సందర్శించి, మరల మా విజ్ఞాపన పత్రం అందజేశాము. ఏనాటికైనా భారత రాజ్యాంగాన్ని తయారు చేయవలసినవారు భారత ప్రజాప్రతినిధులే కాబట్టి, మీ వాదనను వారికి విన్నవించవలసిందని శ్రీ క్రిప్సు మాకు సలహా చెప్పారు. ఆనాటి అనుభవాలను నెమరు వేసుకున్నప్పుడు, దక్షిణ భారతదేశంలో ఎక్కడో ఒక కుగ్రామంలో ఏకాంతంగా కాలం గడుపుతూ ఉన్న యోగిపుంగవుని దివ్యప్రభావం మమ్మెలా నడిపించిందో, తలచుకుని నేను పొంగిపోతూ ఉంటాను. మేమందరం నిమిత్తమాత్రులం. ఆ మహనీయుని తపోబలమే మా బలం. అదే మాకు అండ!

 

మరొక ఘట్టం

అది స్వాతంత్ర్య మహోద్యమానికి ఆయువుపట్టు. నాయకుల మనసులన్నీ నూటికి నూరుపాళ్ళు రాజకీయాలపై లగ్నమైన రోజులు అవి. అయినా మత స్వాతంత్ర్యాన్ని గురించి సర్దార్ వల్లభభాయి పటేల్‌తో సంప్రదించడానికి సాహసించాము. ఆయనతో మత ప్రసక్తి తేగానే అగ్గిపై గుగ్గిలం పోసినట్లయింది. ‘హిందువులలో ఏనాడైనా ఒకరికొకరికి తలలు కూడడం సాధ్యమేనా? అట్టి హిందూమతం అసలు మనడానికే అర్హత లేదు’ అంటూ గర్జించాడు శ్రీ పటేల్.

అంతట నేను ధైర్యం కూడగట్టుకుని, వివిధ వర్గాలకు చెందిన హిందువులలో సమైక్యతాసాధనకు కంచి పీఠాధిపతులు కొనసాగిస్తున్న కృషిని పటేల్‌గారికి నివేదించాను. ఆ మాటలు విని పటేల్ ప్రసన్నుడైనాడు. అంతేకాదు, మనదేశంలో ఒక మఠాధిపతి తన సొంత సిద్ధాంతాల ప్రచారంతో తృప్తిచెందక, సమస్త హిందూమత సంరక్షణకై నడుముకట్టి కృషిచేస్తున్నారన్న మాటలను నమ్మలేకపోతున్నానని ఆశ్చర్యం వెలిబుచ్చాడు! ‘మొదట హిందూమతంలోని వేర్వేరు శాఖలను ఏకముఖం చేయగలిగితే, అటు తరవాత, మీ కోరిక నెరవేరగల ప్రయత్నం ఏదైనా చేయవచ్చు’ అని సర్దారు హామీ ఇచ్చారు.

తదాది, భారతదేశంలోని వివిధ సిద్ధాంతాలకు చెందిన మఠాధిపతులందరినీ సందర్శించి, ఏకాభిప్రాయ సాధనకై తీవ్రప్రయత్నం చేశాము. వివిధ మతసంస్థలకు చెందిన పెద్దలందరను సందర్శించాము. మన దేశ చరిత్రలో ప్రప్రథమంగా ‘అఖిల భారత మఠాధిపతుల మహాసభ’ పేరుతో మఠాధిపతులందరి సహకారాన్ని సమకూర్చడం సాధ్యమైంది. అన్ని శాఖలకు, అన్ని సిద్ధాంతాలకు సంబంధించిన మతాచార్యుల వల్ల మతాన్ని ప్రాథమిక హక్కుగా పరిగణించాలన్న మా వాదనకు బలం చేకూరింది.

 

***********

 

భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించింది. భారత రాజ్యాంగ నిర్మాణానికి రాజ్యాంగ పరిషత్ (కాన్‌స్టిట్యుయంట్ అసెంబ్లీ) ఏర్పాటైంది. అయినా స్వాతంత్ర్యసంపాదన మహోత్సవంలో మతానికి రాజ్యాంగ రక్షణ కల్పించాలన్న యోచనగానీ, ఆసక్తిగానీ ఎవరిలోనూ కనిపించలేదు. ఆ పరిస్థితుల్లో కంచితపస్వి శ్రీ చంద్రశేఖరేంద్రసరస్వతి కంచికి సమీపంలో అంబి అనే చిన్న పల్లెటూళ్ళో ఉన్నారు. మద్రాసులో ఉన్న ప్రముఖ న్యాయవేత్తలను తన సమక్షానికి పిలిపించుకున్నారు. రాజ్యాంగ శాసనం ద్వారా మత స్వాతంత్ర్యాన్ని పరిరక్షించే ప్రతిపాదనలను సూచించవలసిందిగా స్వామి వారిని కోరారు. న్యాయశాస్త్రంలో ప్రవీణులైన ఆ మేధావులంతా చేరి, దీర్ఘంగా చర్చించి, సుదీర్ఘమైన కొన్ని సూత్రాలను తయారు చేశారు.       

 

స్వామి న్యాయశాస్త్ర అవగాహన

కాని కాన్‌స్టిట్యుయంట్ అసెంబ్లీ సలహాదారు వాటినన్నిటిని నిరాకరించి, సంగ్రహంగా తానొక ప్రత్యామ్నాయ ప్రతిపాదనను సూచించాడు. అయితే, ఆశ్చర్యమేమంటే, కామకోటిస్వామి సూక్ష్మగ్రహణశక్తి ముందు కాన్‌స్టిట్యుయంట్ అసెంబ్లీ సలహాదారుని న్యాయశాస్త్ర పాండిత్యం కూడా పనికిరాలేదు. ఆ సలహాదారుని ప్రతిపాదనలోనే కొన్ని ప్రధాన లోపాలను స్వామివారు చూపించి, చివరకు తామే దానిని స్వయంగా సవరణ చేశారు. కాన్‌స్టిట్యుయంట్ అసెంబ్లీలోని పలువురు రాజ్యాంగవేత్తలు స్వామివారి న్యాయశాస్త్ర పరిగ్రహణశక్తిని ప్రశంసించారు.

 

మరొక మెలిక

ఇంత తతంగం జరిగినా, మతానికీ, మతసంస్థలకూ నిర్నిరోధమైన స్వాతంత్ర్యాన్ని రాజ్యాంగంలో కల్పించడానికి రాజకీయ నాయకులు సిద్ధంగా లేరు. అందుచేత, మేము సూచించిన ‘మత స్వాతంత్ర్యం’ అనే పదానికి ముందు ‘చట్ట సమ్మతమైన’ అను మాటలను చేర్చవలసిందిగా వారు సలహా ఇచ్చారు.

ఆ మాటలను చేర్చినట్లయితే ప్రభుత్వం తన ఇష్టానుసారంగా మత విషయాలలో, మత సంస్థల వ్యవహారాలలో జోక్యం కలిగించుకోవచ్చు. ప్రభుత్వం ఏ కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టినా, మతసంస్థలు దానికి అడ్డుచెప్పడానికి వీలుండదు. అంతమాత్రమే కాదు, భవిష్యత్తులో రాబోయే కొన్నికొన్ని ప్రభుత్వాలు అసలు మతంలోనే విశ్వాసం లేనివిగా ఉండవచ్చు. అందుచేత, బిల్లు రెండవమారు చర్చకు వచ్చినప్పుడైనా (సెకెండ్ రీడింగ్ ఆఫ్ ద బిల్) ఆ నిబంధనను తగువిధంగా సవరింపవలసిందని స్వామివారు మాకు చెప్పారు. ఆ ప్రకారమే రాజ్యాంగ పరిషత్ సభ్యులకు మేము విజ్ఞప్తి చేశాము.

 

డా. అంబేద్కర్ మతాభిమానం

ఈ సందర్భంలో ఒక విషయం ప్రత్యేకంగా చెప్పక తప్పదు. సాంఘిక సమస్యలపై డాక్టర్ అంబేద్కర్ గారికి గల తీవ్రమైన అభిప్రాయాలను బట్టి, మేము వారిని సందర్శించినప్పుడు మా సూచనలకు వారు సుముఖులుగా ఉంటారని ఊహించలేదు. కాని, అక్కడ కూడా స్వామివారి ప్రభావమే మాకు సాయపడింది. మాకు గల అనుమానాలు పటాపంచలైనవి. మతం అన్నా, మతసంస్థలన్నా తనకెంతో అభిమానమన్నాడు అంబేద్కర్ మహాశయుడు. ప్రభుత్వం ఏమాత్రం జోక్యం చేసుకోకుండా మతసంస్థలు స్వచ్ఛందంగా మనవలసినవేనని తమ అభిప్రాయం అన్నారు.

అప్పటినుండి మా వ్యవహారం నల్లేరుపై బండిలా నడిచింది. మత సంస్థలకు సంబంధించిన క్లాజును నాలుగు భాగాలుగా విభజించారు. ‘‘చట్టసమ్మతమైన’’ అనే మాటలను నాల్గవ భాగానికి మాత్రమే వర్తింపజేశారు.

మతసంస్థల స్వతంత్ర నిర్వహణకు రాజ్యాంగ రక్షణ సమకూరిందంటే శ్రీ కామకోటిపీఠ పరమాచార్యుల కృషే అందుకు ప్రధాన కారణం. ‘‘ప్రతి మతమూ ఈ హక్కులు కలిగి ఉంటుంది…’’ అని మాత్రమే ఆదిలో ఉండేది. మహామేధావులైన రాజ్యాంగ నిర్మాతలు సైతం ఆ వాక్యరచనలో గల లోపాన్ని గ్రహించలేదు. స్వామివారొక్కరే దాని అసమగ్రతను గ్రహించారు.

హిందూమతానికి చెందిన ఏ వ్యక్తి అయినా, తాను వైష్ణవుడననో, శైవుడనో భావిస్తాడే తప్ప ఓంప్రథమంగా తాను హిందువునని పరిగణించుకోడు. అదేవిధంగా మనదేశంలోని ఏ మతసంస్థ అయినా హిందూమతం పేరుతో వ్యవహరించదు. ఎక్కడ చూచినా వైష్ణవ, స్మార్త, శైవ సిద్ధాంతాది వేర్వేరు సంస్థలుగానే, ఆ పేర్లతోనే నడుస్తూ ఉంటాయి. అందుచేత ‘మతసంస్థలు’ అన్నప్పుడు అనేక శాఖల పేర్లతో నడిచే సంస్థలు పెక్కింటికి రాజ్యాంగ రక్షణ సూత్రం వర్తించకపోవచ్చు. ఆ హేతువు చేత, ‘‘అన్ని మతాలూ, ఆ మతాలకు చెందిన అన్ని శాఖలూ ఈ క్రింది హక్కులు కలిగి ఉంటవి…’’ అనే మాటలను చేర్చవలసిందిగా శ్రీ స్వామివారు సూచించారు. స్వామి సూచన ప్రకారమే ఆ నిబంధన కాన్‌స్టిట్యుయంట్ అసెంబ్లీ ఆమోదం పొందింది.

 

పరమ రహస్యం

ఇంత వ్యవహారం నడిచినా, ఈ సందర్భంలో స్వామివారు వహించిన పాత్ర పరమ రహస్యంగానే ఉండిపోయింది. తాము తెరమరుగునే ఉండి. మన మతానికీ, మత సంస్థలకూ స్వాతంత్ర్యాన్నీ, రాజ్యాంగ రక్షణనూ ప్రతిపాదించిన మహానుభావుడాయన. రాజ్యాంగవేత్తలు, న్యాయశాస్త్ర విశారదులు, న్యాయమూర్తులు అందరూ స్వామివారి ఉపజ్ఞాపూర్వక సూచనలను అనుసరించినవారే అయినారు.

ఇంతవరకు లోకానికి వెల్లడి కాని ఈ మహత్తర విషయాలు మన మత చరిత్రలోనే కాదు, మన రాజ్యాంగ నిర్మాణేతిహాసంలో సైతం సువర్ణాక్షరాలతో చిత్రించదగ్గ అంశాలు.

 

శృంగేరి స్వామి ప్రశంస

ఇదే సందర్భంలో మరువరాని మరొక విషయాన్ని తెలుసుకోవాలి. అది శ్రీ శృంగేరి పీఠాధిపతుల సందర్శనం. హిందూమతసంస్థలకు భారత రాజ్యాంగంలో రక్షణ కల్పించే నిమిత్తం శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు సల్పుతున్న కృషి సందర్భంగా నేనూ నా సహచరులూ దేశంలోని వివిధ మఠాధిపతులను సందర్శించాము. ఆ సందర్భంలోనే అప్పటి  శృంగేరి పీఠాధిపతులు పూజ్యశ్రీ చంద్రశేఖరభారతిస్వామి సమక్షంలో మేమనుభవించిన దివ్యానుభూతి ఎన్నటికీ మరువరానిది.

ఆ మహనీయుడు మఠాధిపతి అయినా, తపస్సంపన్నుడూ, నిరంతర ధ్యాననిమగ్నుడై, ఎప్పుడో ఒకప్పుడు మాత్రమే బాహ్యస్మృతి కలిగి ఉండే మహావ్యక్తి.

మేము శృంగేరికి వెళ్ళిన రోజున, అదేమి భాగ్య విశేషమో గానీ, అంతకుముందే దీర్ఘసమాధినిష్ఠులై ఉండిన స్వామివారు, ఆనాడే బాహ్యస్మృతిలోకి వచ్చి తేజోమయులుగా, జ్ఞానస్వరూపులుగా మాకు దర్శనమిచ్చారు.

చూడడంతోనే స్వామివారు మమ్మడిగిన మొట్టమొదటి ప్రశ్న ‘‘కామకోటి పీఠాచార్యులు ఈమారు వ్యాసపూజ ఎక్కడ చేశారు?’’

‘‘మధ్యార్జునంలో’’ అని మేము సమాధానం చెప్పాము.

అటు తరువాత, హిందూమతసంస్థలకు రాజ్యాంగ రక్షణకై కామకోటి ఆచార్యస్వాములు సల్పుతున్న కృషినీ, దేశంలోని మతసంస్థలన్నింటి సమైక్యతకు వారు కావిస్తున్న ప్రయత్నాలనూ శృంగేరి స్వామికి నివేదించాము.

ప్రసన్నవదనంతో స్వామివారు ఇలా అన్నారు. ‘‘దేశ పరిస్థితులను సుసూక్ష్మంగా గ్రహించి, ప్రస్తుత పరిస్థితిలో మన కర్తవ్యమేమిటో గుర్తించజాలినవారు కంచిస్వామి వారొక్కరు మాత్రమే. ఈ విషయంలో మేమందరమూ వారి కృషి పైనే ఆధారపడతాము. ఇందుకు మేము వారికెంతో కృతజ్ఞులము.

వర్తమానకాలంలో మనదేశంలోని హిందూమతస్థులు ఈమాత్రమైనా స్వధర్మావలంబకులై ఉన్నారంటే అందుకు ప్రధానంగా శ్రీ కంచి శంకరాచార్యులే ప్రేరకులు.’’

పైమాటలు చెప్పి, శ్రీ సంగమేశ్వరశాస్త్రిగారనే ఒక మఠాధికారిని పిలిచి, శృంగేరి పీఠంతో సంబంధం గల తీర్థముక్తపురి, హరిహరూర్ పీఠాధిపతులను కలసుకొని, కంచిస్వామివారు సంకల్పించిన ప్రయత్నంలో అన్నివిధాలా మాకు తోడుపడవలసిందని చెప్పి, వారిని మావెంట పంపారు.

ఆ మఠాధిపతులతో మాట్లాడి, తిరిగి శృంగేరికి వచ్చి, శ్రీ చంద్రశేఖర భారతి స్వాములకు మా కృతజ్ఞతను తెలుపుకున్నాము.

హిందూమతోద్ధరణకు కంచిస్వామి చేస్తున్న సేవలకు తామెంతో కృతజ్ఞులమంటూ మరోమారు ప్రశంసించి శృంగేరి స్వామి మాకు సెలవిచ్చారు.

 

(‘శంకర – షణ్మత’ గ్రంథంలోని ఆంగ్లవ్యాసం నుంచి అనువాదితం)

(‘నడిచే దేవుడు’ గ్రంథం నుండి సంగ్రహితం)

Tags: Chandrasekharendra Saraswati SwamigalConstitution of IndiaFundamental RightsKanchi Kamakoti PeethamKanchi PeriyavaSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

దేవాలయంలో తొక్కిసలాట : ఆరుగురు మృతి
general

దేవాలయంలో తొక్కిసలాట : ఆరుగురు మృతి

సనాతన ధర్మాన్ని పునరుద్ధరించిన కాలాతీత తత్వవేత్త
Latest News

సనాతన ధర్మాన్ని పునరుద్ధరించిన కాలాతీత తత్వవేత్త

విశాఖ శారదా పీఠానికి టీటీడీ నోటీసులు
general

విశాఖ శారదా పీఠానికి టీటీడీ నోటీసులు

అయోధ్య రామయ్య ఆలయంలో సొరంగ మార్గం
general

అయోధ్య రామయ్య ఆలయంలో సొరంగ మార్గం

నా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా : భూమన కరుణాకర్‌రెడ్డి
general

నా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా : భూమన కరుణాకర్‌రెడ్డి

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.